ప‌్రాణాంతక కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్ అమలు లాంటి పరిణమాల నేపథ్యంలో దేశంలో పేదలకు ఉపాధి కరువైంది. దీంతో ప్రభుత్వాలు అందించే సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు రేషన్ షాపుల ద్వారా బియ్యం, నిత్యావసరాలను అందిస్తున్నాయి. అదే సమయంలో రూ.500 నుంచి 1500 వరకు నగదు సాయం కూడా చేస్తున్నాయి.
గురువారం తమిళనాడు ప్రభుత్వం కూడా ఉచితంగా బియ్యం, నిత్యావసరాల పంపిణీని చేపట్టింది. దీంతో జనం రేషన్ షాపులు ముందు బారులు తీరారు. అయితే, ఈ సందర్భంగా జనం సోషల్ డిస్టెన్స్ పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. షాపుల ముందు సర్కిల్స్ గీసి ఆ సర్కిళ్లలోనే లబ్ధిదారులను నిల్చోబెడుతున్నారు. ఎక్కువ మంది నిలబడటానికి స్థలాభావం ఉన్న ప్రాంతాల్లో టోకెన్లు ఇచ్చి, ఆ టోకెన్లలో పేర్కొన్న సమయంలో వచ్చి రేషన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. స్థలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టెంట్లు వేసి క్యూ లైన్లలో కూర్చోబెడుతున్నారు.