బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన సంజయ్‌ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి సంజయ్‌ కుమార్‌ ఎంపీగా గెలుపొందారు. బండి సంజయ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ సంస్థల్లో చురుగ్గా పని చేశారు. 2005లో కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 48వ డివిజన్‌ నుంచి గెలుపొందారు సంజయ్‌. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ కొనసాగారు.