హ్యాపినెస్‌ క్లాస్‌రూమ్‌పై మెలానియా ప్రశంసలు

ఢిల్లీలోని సర్వోదయ కో-ఎడ్యుకేషన్‌ సెకండరీ స్కూల్‌ను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ సందర్శించిన విషయం విదితమే. ఈ స్కూల్లో అమలు చేస్తున్న హ్యాపినెస్‌ క్లాస్‌రూమ్‌ విద్యావిధానంపై మెలానియా ప్రశంసలు కురిపించారు. ఈ పాఠశాల విద్యావిధానం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ఇది అందమైన పాఠశాల.. విద్యార్థులు సంప్రదాయ పద్దతిలో తనకు స్వాగతం పలకడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు మెలానియా. భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.. ఇక్కడి ప్రజల స్వాగతం ఎప్పటికీ మరిచిపోలేనిది. భారతీయులు దయాహృదయులు అని ఆమె కొనియాడారు. యూఎస్‌లో పిల్లల శ్రేయస్సు కోసం బీ బెస్ట్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్నాము అని మెలానియా తెలిపారు. బీ బెస్ట్‌ ద్వారా మూడు అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. మాదక ద్రవ్యాల వల్ల ప్రమాదాలు, ఆన్‌లైన్‌ భద్రత యొక్క ప్రాముఖ్యత, పిల్లల సమగ్ర రక్షణ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని మెలానియా చెప్పారు. ఇక మెలానియా ట్రంప్‌కు.. సర్వోదయ విద్యార్థినులు మధుబని పెయింటింగ్స్‌ను కానుకగా ఇచ్చారు. స్కూల్‌ నుంచి వెళ్తున్న సమయంలో మెలానియా.. అమ్మాయిలను హత్తుకున్నారు. పిల్లలతో కరచాలనం చేసి వీడ్కోలు పలికారు మెలానియా.